ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్
అగజనన పద్మార్కం గజాననం అహర్నిశం

The pessimist sees difficulty in every opportunity ... The optimist sees the opportunity in every difficulty
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
1.
విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు అల్లనల్ల నంతనింత నదిగోవారే చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా
గరుడ కిన్నరయక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల పరిపరివిధముల బాడేరునిన్నదివో సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా
పొంకపు శేషాదులు తుంబురునారదాదులు పంకజభవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలుమంగను వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
3.
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పరమయోగులకు పరిపరివిధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము
4.
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంత నింత గొల్లెతల అరచేతి మాణికము పంత మాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము బాలునివలె దిరిగీ బద్మ నాభుడు
5.
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా
భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము తావై రక్షించేటి ధరణీధరా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా లడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
6.
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి
అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి
కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి ఘనమైన దీపసంఘములు గంటి అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి
అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి సరిలేని యభయ హస్తము గంటి తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి
7.
నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో
మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమపురుష భవబంధ విమోచన నరమృగశరీర నమో నమో
జలధిశయన రవి చంద్రవిలోచన జలరుహ భవనుత చరణయుగ బలిబంధన గోపవధూవల్లభ నలినోదర తే నమో నమో
ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహన రూప వేదోద్ధర శ్రీ వేంకటనాయక నాదప్రియ తే నమో నమో